సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థను పాలకులు నీరు కారుస్తున్నారని తమ విధానాలతో బ్రష్టు పట్టిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, లక్ష్మణ్ లు తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయికరణ చేయాలని ప్రయత్నిస్తున్నదని, పసిమెదళ్లలోకి మతాన్ని చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపించారు. ఖమ్మం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం నాడు జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. తొమ్మిదేళ్ల తెలంగాణ పాలనలో విద్యకు కేటాయించాల్సిన బడ్జెట్ను కేటాయించలేదని కేటాయించింది కూడా ఖర్చు చేయలేదన్నారు. విద్యార్థి వీరుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ సిద్ధించిన సిఎం కేసిఆర్ ఎప్పుడు వారి గురించి ఆలోచించలేదని మణికంఠ, లక్ష్మణ్ లు ఆరోపించారు. ఆంధ్రాకు చెందిన కార్పొరేట్ కళాశాలలను తరిమికొడతామని చెప్పిన సిఎం కేసిఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎర్ర తివాచి పరిచి స్వాగతం పలుకుతున్నారని ఎన్నికల సందర్భంగా జూనియర్ కళాశాలల్లో మిడ్డేమిల్స్ సహా ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని వారు ఆరోపించారు. పేదలకు ప్రభుత్వ విద్య క్రమేపి దూరమవుతుందని విద్య విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందేనన్నారు. ఒకరు కార్పొరేట్లకు కొమ్ముకాస్తుంటే మరొకరు మతాన్ని విద్యార్థులపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విద్యార్థులు వినియోగించే వస్తువులపై జిఎస్టి విధించటం విద్యా వ్యతిరేకతను తెలియజేస్తుందన్నారు. మార్చి నాలుగు, ఐదు తేదీలలో ఖమ్మంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విస్తృత కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మడుపల్లి లక్ష్మణ్, ఇటికాల రామకృష్ణ, యువరాజ్, నాగులమీరా, సతీష్, ఉజ్వల్, చందులాల్, కాశి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin