సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో రైతన్నల గోడు తెలుసుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తూ ప్రజలకు సాగునీరు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నాడని, కేవలం కమిషన్ల కోసమే తెలంగాణ మొత్తాన్ని దోచుకున్నారని ఇప్పుడు దేశం మీద పడుతున్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ సాధన కోసం చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. స్థానిక నేత ఎం.డీ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఆమె ఈ ధర్నాకు హాజరయ్యారు. ముందుగా చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా మహా ధర్నాకు చేరుకున్నారు. కాంగ్రెస్, బీఎస్పి, వైయస్సార్ టిపి, సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో హాజరయ్యారు. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, పాలమూరు ఐక్యవేదిక కన్వీనర్ రాఘవాచారి, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు హాజరైన కార్యక్రమాన్ని ఉద్దేశించి వైయస్ షర్మిల మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను నిర్మించి తీరుతామని హామీ గుప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమయ్యారంటూ? ప్రశ్నించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఆఖరి ఆరో పాయింట్ గా సూచిస్తూ ఆ తర్వాత దాని ఊసే ఎత్త లేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, భీమ, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని అన్నారు. ఆ మహానేత వైయస్ రైతుల పక్షపాతి అని కొనియాడారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కమిషన్ల ఆశ కోసం ప్రాజెక్టుకు రీడిజైన్ల పేరుతో కాలేశ్వరానికి తరలించకపోయారని ఆరోపించారు. గత పది ఏళ్లలో ఇక్కడ ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. 18 లక్షల ఎకరాలకు కాలేశ్వరం ద్వారా నీరు ఇస్తామని 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి లక్ష ఎకరాలకు నీరు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి కాస్త అయినా ఇంకిత జ్ఞానం, సిగ్గు రెండు లేవని ఆమె విరుచుకుపడ్డారు. కమిషన్ల కోసం తప్ప రాష్ట్రాన్ని దేనికోసం వాడుకోవడం లేదని ఆమె అన్నారు. రీడిజైన్ చేయడం మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు ఇవ్వడం కమిషన్లు నొక్కేయడం ఇదే దందాగా మారిందని ఆమె అన్నారు. అన్ని ప్రాజెక్టులు రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డివేనని అన్నారు. చివరకు పాఠశాలల్లో బెంచిల సరఫరా కూడా మెగా కృష్ణారెడ్డికే ఇచ్చారని అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రంలో ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు దేనికోసం చేసినట్టు? అనీ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో దోపిడీ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు దేశం మీద పడ్డారని అన్నారు. అదేవిధంగా మతతత్వ బిజెపి పార్టీ రాష్ట్రంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా మత కల్లోలాలు సృష్టించుకుంటూ కూర్చుని ఆ చిచ్చులో చేతులు కాచుకుంటుందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గద్దె దిగితే తప్ప ప్రజలకు ఏవి రావు అని ఆమె అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలని సర్కార్ పోవాలని ఆమె సూచించారు. నీళ్లు నిధులు ఉద్యోగాలు రావాలంటే కెసిఆర్ గద్దె దిగాలని ఆమె అన్నారు. ఏ వర్గానికి మేలు చేయని కేసీఆర్ ను రాళ్లతో తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని ఆమె అన్నారు. ఏరు దాటాక తెప్ప తగిలేసే వైనం టిఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆమె విమర్శించారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న షాద్ నగర్ నియోజకవర్గం లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణం కావాల్సిందేనని దీనికోసం తాను శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ఎప్పుడు పిలిచినా తాను షాద్ నగర్ రావడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. నెత్తి మీద కుండా పెడతానని చెప్పిన కేసీఆర్ కల్లబొల్లి మాటలను మరోసారి ప్రజలు నమ్మొద్దని రాజకీయాలకు అతీతంగా రిజర్వాయర్ నిర్మాణం కోసం అందరూ ఏకం కావలసిన అవసరం ఉందని షర్మిల అన్నారు. షాద్ నగర్ ప్రజల పక్షాన తాను నిలబడతానని భరోసా ఇచ్చారు. ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న పాడిన పాటలు సభను రక్తి కట్టించాయి. ఈ కార్యక్రమంలో ఆయా ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు మహమ్మద్ ఇబ్రహీం, రమాదేవి, శీలం శీను తదితర నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
-----------------------
Admin