సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ తొలి దశ,మలిదశ ఉద్యమంలో కొత్తగూడెం ప్రాంతం....మరీ ముఖ్యంగా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలలో పాల్గొన్నారని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్ గుర్తు చేశారు.తెలంగాణ అమరవీరుల మృతికి చిహ్నంగా కొత్తగూడెం బస్టాండ్ వద్ద గల చిల్డ్రన్స్ పార్కును అమరవీరుల స్మృతివనంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ శ్రేణులతో కలిసి సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ 1969 వ సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో కొత్తగూడెంలో ఇద్దరు వ్యక్తులు అమరులయ్యారని గుర్తు చేశారు.అదేవిధంగా మలిదశ ఉద్యమంలో సైతం కార్మిక ప్రాంతమైన కొత్తగూడెం చిరస్మరణీయమైన పోరాటాలు చేసిందని తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కోసం సింగరేణి యాజమాన్యం ఏదైనా ఒక కార్యచరణ రూపొందిస్తే బాగుంటుందని వేచి చూశామని అలాంటిదేమీ జరగకపోవడం శోచనీయమన్నారు.ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలి ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను తమ ఆత్మ బలిదానాలతో ప్రపంచానికి చాటిన అమరవీరుల త్యాగాలను మరిచిపోవద్దని అన్నారు.తొలి,మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు సరైన నివాళులు అర్పించాలంటే కొత్తగూడెంలోని చిల్డ్రన్స్ పార్క్ ను అమరవీరుల స్మృతివనంగా ప్రకటించడంతో పాటు ప్రత్యేక నిధులు కేటాయించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.అనంతరం జీఎం వెల్ఫేర్ బసవయ్య కు వినతిపత్రం అందజేశారు ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,సాయి,జిల్లా కార్యదర్శులు మాలోత్ వీరు నాయక్,చెనిగారపు నిరంజన్ కుమార్,సిద్దంకి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin