సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నయవంచకపాలన సాగిస్తుందని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.హోంగార్డ్ రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీఎస్పి ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ బస్టాండ్ నుంచి ప్రారంభమై పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా స్థానిక అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంది.ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జీతం డబ్బుల కోసమని వెళ్లిన హోంగార్డ్ రవీందర్ మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.సంపన్న రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో హోంగార్డులకు సైతం సకాలంలో జీతాలు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.బీఆర్ఎస్ పాలనను సాగించింది మొదలు ఈ తొమ్మిదేళ్ల కాలంలో కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ,నయవంచన మాటున పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.జీతం రాలేదనే కారణంతో హైదరాబాదులో ఒక హోంగార్డ్ ఆత్మహత్య చేసుకోవడం అనేది రాష్ట్ర దౌర్భాగ్యస్థితికి నిదర్శనమని,కెసీఆర్ నియంత పాలనకు పరాకాష్ట అని అన్నారు.అన్ని వర్గాల ప్రజలను మోసం,దగా చేస్తూ బీఆర్ఎస్ పాలన సాగిస్తుందని ఆరోపించారు.శాంతి భద్రతలు అదుపుతప్పినప్పుడు వాటిని పరిరక్షించేందుకు హోంగార్డులు సైతం రేయింబవళ్లు కష్టపడుతుంటారని అన్నారు.వారికి సైతం న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి...? గంగలో కలిస్తే ఏంటి...? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకనైనా ప్రభుత్వం తేరుకొని హోంగార్డుల జీవితాలపై భరోసా కల్పించే విధంగా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.హోంగార్డ్ రవీందర్ కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా రవీందర్ మృతికి నిరసనగా ధర్నాలు,ఆందోళనలు,దీక్షలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,జిల్లా సహాయ కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,కవిత,కౌశల్య తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin