సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తండ్రేమో నీళ్లను దోచుకెళ్తే.. కూతురు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ముసలి కన్నీరు కార్చడం వైయస్ షర్మిల వంతైందని, అదేవిధంగా అధికారంలో ఉన్న బిజెపి తన పరపతిని మరిచి మాట్లాడుతున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పదిసార్లు పట్టం కడితే ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలంటూ కాంగ్రెస్, బిజెపి, వైయస్సార్ తెలంగాణ పార్టీల విమర్శలపై టిఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. మహాధర్నా సందర్భంగా వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ మంగళవారం షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, మన్నె నారాయణ, ఎమ్మే సత్యం, రామకృష్ణ, శ్రీశైలం గౌడ్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు వద్ద రెగ్యులేటర్ ద్వారా నాలుగు తూములకు 10 తూములు నిర్మించి ఆంధ్రకు నీళ్లు తరలించుకోపోయిన సంఘటనను గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం మరో తూము నిర్మించి జిల్లాకు మొట్టమొదట అన్యాయం చేసింది మీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాదా అనీ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించారని చెబుతున్న వైయస్ షర్మిల అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో మొదటి పంప్ హౌస్ కు మూడు రిజర్వాయర్లను నిర్మించిన సంగతి మరువద్దని సూచించారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంత జరిగిందో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎంత జరిగిందో? చూడటానికి గత సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్య బస్సులు పెడతామంటూ ప్రస్తావన చేశారని గుర్తు చేశారు. 60 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ప్రజలను పాలించిన కాంగ్రెస్ పార్టీ లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు గురించి ఎందుకు కనుక్కోలేకపోయిందని ప్రశ్నించారు. లక్ష్మీదేవి పల్లి ఒక ఎత్తైన ప్రదేశం అని మొట్టమొదట గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఇక్కడ రిజర్వాయర్ కట్టాలంటే కృష్ణ నది నుండి నీళ్లు ఎత్తిపోయాలని పేర్కొన్నారు. అందుకోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దీనికి జలాలు అందించాలన్న నిశ్చయంతో ప్రభుత్వం ఈ రిజర్వాయర్లు ఏర్పాటు చేయబోతుందంటూ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే నార్లాపూర్, కరివేన, ఏదుల, వట్టెం వద్ద రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయని, ఉదండాపూర్ వద్ద 80% పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఒక కాంగ్రెస్ నాయకుడు రెండుసార్లు అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని 10 సార్లు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే మీరేం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సిఎం సూచించినట్టు పేర్కొన్నారు. ఉదండాపూర్ వద్ద గ్రావిటీ ద్వారా వీలైనంతవరకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆ తరువాత లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మించి ఒకవేళ కృష్ణా నదిలో జల కొరత ఏర్పడినప్పుడు గోదావరి జలాలు కూడా వాడుకునేందుకు ప్రత్యామ్నాయంగా పథకాన్ని రూపొందించారని వివరించారు. కాలువల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. టెండర్ పిలవడం కోసం ఇచ్చిన ఉత్తర్వుల వివరాలను కూడా మీడియాకు విడుదల చేశారు. గతంలో లక్ష్మీదేవి పల్లి వద్ద సర్వే నిర్వహించడానికి హెలికాప్టర్లు వస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించింది ఎవరో? ప్రజలను అడిగితే చెప్తారని అన్నారు. ఇక బిజెపి నాయకులు లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ గురించి ఎవరు అన్యాయం చేస్తున్నారో వాళ్లే చెప్పాలని అన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం కృష్ణానది జలాల్లో వాటా ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించారు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఈ సమస్యను ఇంకా జటిలం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని వారు అన్నారు. నీటి వాట పంపిణీకి కేంద్రం ఇంత ఆలోచన చేయడం భావ్యమేనా అని ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వస్తే లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్న బిజెపి నాయకులు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయారా? అని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాల్సిన బాధ్యత బిజెపి పై లేదా అనీ ప్రశ్నించారు.
-----------------------
Admin