సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లా వ్యాప్తంగా విద్యారంగ మరియు సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 12న ఐక్య వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ జిల్లాలో విజయవంతమైంది.ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం,ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీం దాదా,పిడిఎస్ యూ జిల్లా కార్యదర్శి కాంపాటి పృధ్వీ,పిడిఎస్ యూ జిల్లా కార్యదర్శి ఆవుల సాంబ,పిడిఎస్ యూ జిల్లా కార్యదర్శి ఇర్ప రాజేష్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగం ప్రమాదపుటంచున ఉందనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా విద్యారంగానికి కేటాయించే బడ్జెట్లో కోత విధుస్తుందనీ, తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ 2020-2021 పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం దేశంలో 31వ స్థానంలో ఉందనీ, తొమ్మిది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహించడమే దీనికి కారణమన్నారు. రాష్ట్రంలో 607 ఎంఈవో పోస్టులకు గాను,కేవలం 17 మంది రెగ్యులర్ ఎంఈఓ లు ఉన్నారనీ,33 డిఈఓ పోస్టులకు గాను కేవలం 7 మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారనీ,66 డిప్యూటీ డీఈవో పోస్టులకు 6 మంది రెగ్యులర్ అని అన్నారు.రాష్ట్రంలో 40 వేల పై చిలుకు పాఠశాలలు ఉంటే వాటిల్లో 6 శాతం పాఠశాలలు మాత్రమే విద్యా హక్కు చట్టం-2009 నిర్ధేశిత ప్రమాణాలకు లోబడి పనిచేస్తున్నాయని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం 10 శాతం నిధులు విద్యా రంగానికి కేటాయించిన ప్రభుత్వం కేవలం ఈ సంవత్సరం 6 శాతం నిధులు కేటాయించారనీ,ప్రతీయేటా తగ్గిస్తున్నారని అన్నారు.గత బడ్జెట్ సమావేశాల్లో 3000 కోట్లు ఖర్చుపెట్టి 12,000 పాఠశాలలు మన ఊరు మనబడి పథకం కింద చేర్చి పూర్తి చేస్తామన్న ప్రభుత్వం కేవలం 1200 పాఠశాలలు పూర్తి చేసారన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు సిండికేట్లుగా ఏర్పడి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటుంటే ప్రభుత్వం తనకు పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు.నిబంధనలు తుంగలో తొక్కి కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ,బీసీ గురుకులాలు నూతన గురుకులాలు ప్రారంభించడంలో ఉన్నంత ఆర్భాటం, వాటిని నిర్వహించడంలో నాణ్యమైన భోజనం అందించడంలో లేదన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం లేదని, కోట్ల రూపాయల్లో బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మాటేలేదనీ, టాయిలెట్స్,మంచినీరు వంటి సమస్యలు విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నాయనీ అన్నారు.డిగ్రీ కళాశాలలో కోర్సుల ఎత్తివేత కు కారణం అయ్యా కళాశాలలో నియామకాలు చేపట్టక పోవడమే అన్నారు. ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న పాఠ్య పుస్తకాలు, యూనిఫారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకే, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకే ప్రభుత్వానికి నిరసన సెగ తగిలేలా బంద్ నిర్వహించామని అన్నారు. సహకరించిన ప్రభుత్వ,ప్రైవేటు యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు.బంద్ లో కొత్తగూడెం పట్టణ కార్యదర్శి నాగ కృష్ణ, అధ్యక్షులు రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin