సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : శ్రీసిటీలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ వార్షిక ఉత్సవాలు శనివారం అత్యంత వేడుకగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, శ్రీమద్భాగవత పారాయణ ప్రతిధ్వనులతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. పరిశ్రమల ఉద్యోగులు, ట్రిపుల్ ఐటీ, క్రియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం వేదపండితుల సంకల్పం, కలశపూజ, పుణ్యాహవచనం, వేదపారాయణం కార్యక్రమాలతో వార్షిక ఉత్సవాలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విష్ణు సహస్రనామ పఠనం, గణపతి హోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం తదితర పూజలు నిర్వహించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హోమం నిర్వహించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వార్షిక ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి ఆలయ ప్రాంగణంలో భాగవత సప్తాహం కొనసాగుతోంది. ఇందులో స్థానిక భాగవత భక్త సమాజం సభ్యులు భక్తి శ్రద్దలతో శ్లోకాలు పఠిస్తూ శ్రీమద్భాగవత పారాయణం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయ వార్షిక ఉత్సవాలు విజయవంతం కావడం పట్ల డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామస్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. స్వామివారి దర్శనం, వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ తీర్థ, అన్నప్రసాదాలు అందచేశారు.
-----------------------
Admin