సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : టియూటబ్ల్యూజె రాష్ట్ర తృతీయ మహాసభలు బుధవారం ఖమ్మంలోని ఉషాహరి కన్వెన్షన్‌లోని కామ్రేడ్ అమర్‌నాధ్ ప్రాంగణంలో అట్టాహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలను రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జర్నలిస్టు అమరవీరులకు, ఇటీవల మృతిచెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రతినిధులు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో టియూడబ్ల్యూజె గురించి రూపొందించిన పాటను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందేనన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని రూపొందిస్తోందన్నారు. మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరమైన ప్రమాణాలు పాటిస్తూ సమాజ చైతన్యానికి పని చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహ్వానం సంఘం అధ్యక్షులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలకు ఖమ్మం ఆతిధ్యమివ్వడం సంతోషకరమని, జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు పోవాలని కోరారు. ఇంకా మాజీ ఎంఎల్‌ఏ గుమ్మడి నర్సయ్య, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు, ఐజెయూ జాతీయ నాయకులు ఎస్‌ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్ తదితరులు మాట్లాడారు. పలు రాష్ట్రాల నుండి వచ్చిన సౌహార్ధ్ర ప్రతినిధులు ప్రసంగించారు. మహాసభలు ఉత్సాహబరితంగా సాగాయి. మధ్యాహ్నం ప్రతినిధుల సభ జరిగింది. సాయంత్రం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. -నగరంలో జర్నలిస్టుల సందడి టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల సందర్భంగా 33 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. వీరితో పాటు ప్రారంభ సభకు జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో నగరంలో సందడి నెలకొంది. ఎక్కడా చూసినా ప్లెక్సీలు, బ్యానర్లు కనబడడంతో మహాసభల గురించి ప్రత్యేక చర్చ జరిగింది. -నేటి ముగింపు సభకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సిఎం నేడు జరుగనున్న టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల ముగింపు సభకు రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ ముగింపు సభలో ఆయన తో పాటు మీడియా అకాడమి ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐజెయూ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు....
-----------------------
Admin