సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వివాద పడుతున్న ఇరుపక్షాల వారు గెలుపొందాలంటే లోక్ అదాలత్ ద్వారా రాజీ పడటం ఒక్కటే మార్గమని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ సన్నాహక చర్యల్లో భాగంగా శనివారం న్యాయమూర్తి పోలీసు అధికారులు న్యాయమూర్తులు మరియు ఆర్థిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భారత సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ సూక్తులను ఉటంకించారు. వ్యక్తులు గాని సంస్థలు గాని ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్లనే వివాదాలు కోర్టుల వరకు వస్తున్నాయని అటువంటి వివాదాలను మొదట రాజీమార్గంలో పరిష్కరించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ వివాదంలో ఇరుపక్షాల వారు గెలుపొందుతారని ఇది లోక్ అదాలత్ ద్వారా మాత్రమే సాధ్యమని న్యాయమూర్తి అన్నారు. రాజీమార్గం విలువైనదని అమూల్యమైనదని ఆయన అన్నారు. లోకదాల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని దీనికోసం ఎటువంటి కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఒకవేళ వివాదం లోక్ అదాలత్ ద్వారా రాజీ అయితే ఇంత క్రితం ఆ వివాదంలో పార్టీలు చెల్లించిన కోర్టు ఫీజు వారికి తిరిగి వాపసు చేయబడుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా జారీ అయ్యే తీర్పు అంతిమమైనదని దీనిపై అప్పిలు ఉండదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మానవ హక్కుల చట్టంలోని అన్ని అంశాలను చదివి వినిపించి వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజలకు సేవకులేనని కాబట్టి వారు ప్రజల పట్ల గౌరవంగా మెలగాలని ఉద్బోధించారు. ఖమ్మం జిల్లాలో మొదటి అదనపు జిల్లా కోర్టును మానవ హక్కుల కోర్టుగా హైకోర్టు గుర్తించిందని కానీ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి కేసులేవి పెండింగులో లేవన్నారు. దీనికి కారణం ప్రజల్లో మానవహక్కుల చట్టంపై అవగాహన లేకపోవడమేనని చెప్పారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా మాట్లాడుతూ గత జాతీయ లోక్ అదాలత్ లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నిలిచిందని దీనిని సాధించటానికి కృషిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. అదేవిధంగా ఈ లోక్ అదాలత్ లో కూడా అందరూ కృషి చేసి ఎక్కువ కేసులను పరిష్కరించాలని ఆయన ఆకాంక్షించారు. కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం ద్వారా కొన్ని గ్రామాలనైనా వివాద రహిత గ్రామాలుగా తయారు చేయాలన్నదే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని ఆయన అన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎన్ సంతోష్ కుమార్, ఎన్ అమరావతి, ఎన్ వెంకట హైమ పూజిత, పి మౌనిక, ఆర్ శాంతి లత, చిట్ఫండ్ కంపెనీల న్యాయవాది చంద్రశేఖర గుప్తా, పోలీసు అధికారులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin