సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మధిర డివిజన్లో అనేక రహదారులు గుంతల మయంగా మారాయని, రహదారుల మరమ్మతుల కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ కో. ఆర్డినేటర్, దళిత విభాగం జిల్లా అధ్యక్షులు, రిటైర్డ్ సి. ఐ డాక్టర్ మద్దెల ప్రసాదరావు డిమాండ్ చేశారు. సోమవారం నాడు మధిర మండలంలో గుంతలుమయంగా మారిన పలు రహదారులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రధాన రహదారులపై భారీ స్థాయిలో గుంతలు ఏర్పడటంతో అనేక సార్లు ప్రమాదాలు జరిగి కొందరు మృత్యువాత గురికాగా, మరికొందరు తీవ్రగాయాలతో బయట పడ్డారన్నారు. మధిర వైరా ప్రధాన రహదారిపై ఆత్కూరు సమీపంలో అడుగు లోతులో గుంతలు ఏర్పడి అనేక ప్రమాదాలు జరిగాయన్నారు. మధిర పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో భారీ స్థాయిలో గుంతలు పడ్డాయన్నారు. బోనకల్లు మండలంలో వివిధ గ్రామాలకు వెళ్ళే అనేక లింక్ రోడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయన్నారు. అదే విధంగా మధిర నుండి ఇల్లూరు వెళ్ళే రహదారి ధ్వంసమైందన్నారు. అదేవిధంగా మల్లారం మీదగా నెమలి వెళ్లే రోడ్డు బోనకల్ బ్రిడ్జి పైన భారీ స్థాయిలో గుంతలు పడ్డాయన్నారు. మండలంలో రావినూతల నుండి పొద్దుటూరు వెళ్లే రహదారి, తూటికుంట్ల నుండి గొల్లపూడి వెళ్లే రహదారి సైతం అనేక సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో అనేక రహదారులపై గుంతలు ఏర్పడటంతో ఆ రహదార్లుపై ప్రయాణం చేయాలంటే ప్రజలు, వాహనదారులు నరకయాతన పడుతున్నారని ఆయన అన్నారు. నిధులు మంజూరు చేసి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు.
-----------------------
Admin