సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక అనునిత్యం దళితులను మోసం చేస్తూనే ఉన్నారని, వారికి రావలసిన హక్కును కాలరాసి దళిత నిధులను దర్జాగా కైంకర్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్పల్లి నరేందర్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అయితే ఆయన ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నారని దళిత బందులో మూడు లక్షల కమిషన్లు నొక్కేశారంటు ఘాటుగా ఆరోపించారు. సోమవారం టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతోపాటు దళిత విభాగం నేత కిరణ్, ఐఎన్టియుసి నేత రాష్ట్ర కార్యదర్శి రఘు, పిసిసి సభ్యులు బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జల్పల్లి నరేందర్ మాట్లాడుతూ.. అక్కరకు వచ్చినప్పుడు మాత్రమే పాలకులకు, పాలక పార్టీలకు దళితులు గుర్తుకొస్తారని, వారి సంక్షేమం, అభివృద్ధిపై ఎంతగానో ప్రేమను ఒలకపోస్తాయనీ ఆన్నారు. అక్కర తీరగానే దళితులను కానీ, వారి అభివృద్ధి కానీ అస్సలు గుర్తుకు రాదనీ విమర్శించారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తారనీ పాత పథకాలకు పాతరేయటమో, లేదా తూతూ మంత్రంగా అమలు చేయటమో చేస్తుంటారనీ ఆన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ పథకం గతి కూడా అంతేనని, ఈ పథకానికి నిధుల కేటాయింపులు జరుగుతున్నా, అవి ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి అని ఆయన అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించారంటూ ఆరోపించారు. అసమాన సమాజంలో వెనుకబడిన కులాలకు ప్రత్యేక నిధులు కేటాయించి, వాటిని ఖచ్చితంగా, సక్రమంగా సంక్షేమం కోసమే ఖర్చు చేయాలన్నది రాజ్యాంగ సంకల్పం అనీ, అణగారిన వర్గాల ప్రత్యేక నిధుల కేటాయింపుపై చర్చ చేశారు. 1975లో ఇందిరాగాంధీ దళిత, గిరిజన వర్గాలకు ప్రత్యేక నిధుల పేరిట కేటాయింపులు చేశారనీ, దళిత, గిరిజన కులాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిధుల కోసం దళితుల ఐక్య పోరాటాలు జరిగాయనీ గుర్తు చేశారు. దీంతో దేశంలోనే తొలిసారిగా 2013లో ఉమ్మడి ఏ.పీ. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి షెడ్యుల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగల సంక్షేమం, అభివృద్ధి కొరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకు వచ్చారనీ, ఈ సబ్ ప్లాన్ ద్వారా జనాభా ప్రాతిపదికన దళిత, గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారనీ బడ్జెట్ కేటాయింపుల్లో నిధులను సబ్‌ప్లాన్‌కు కేటాయించేలా చట్టం కూడా తెచ్చారనీ చెప్పారు. అప్పటి ఉపముఖ్య మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, పలు జిల్లాల పర్యటనల అనంతరం నివేదికనూ సమర్పించారు. దాదాపు రూ.8 వేల కోట్లు ఆ నాటి బడ్జెట్‌లో కేటాయించారనీ ఈ నిధుల వ్యయంపై ఎస్సీ, ఎస్టీ కమీషన్ల పర్యవేక్షణ, నిధుల అమలుకు నోడల్ ఏజన్సీలు, సోషల్ ఆడిట్‌లు, రాష్ట్ర స్థాయి, జిల్లాల స్థాయి మానటరింగ్ కమిటీల అంశాలనూ చట్టంలో పొందుపరిచారనీ, బడుగుల బాగు కొరకు తీసుకువచ్చిన అలాంటి బృహత్తర సబ్‌ప్లాన్ ఏమయ్యింది, సబ్‌ప్లాన్‌కు నిధుల కేటాయింపు జరుగుతుందా, కేటాయించిన నిధులను సబ్‌ప్లాన్ చట్టంలో చెప్పినట్లుగా ఎస్సీలకు, మాత్రమే వినియోగిస్తున్నారా, వీటిపై సమీక్ష లేవి, మానిటరింగ్ కమిటీలేవి, సామాజిక తనిఖీలు ఎక్కడ, ప్రశ్నలకు ప్రభుత్వాల దగ్గర సమాధానాలు లేవనీ నరేందర్ విరుచుకుపడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో లబ్ధిదారుల వద్ద మూడు లక్షల కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆదరణతో సహా ప్రకటిస్తామని అన్నారు.
-----------------------
Admin