సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తాను తల్లిని కావాలనుకుంటున్నానని కావున తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఓ భార్య వేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆమె భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన 25 ఏండ్ల రాహుల్ ఓ బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతను ప్రస్తుతం 20 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని రాహుల్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సానుకూలంగా స్పందించింది. దోషి భార్య పిల్లలు కావాలని కోరుకుంటోందని, భర్త లేకుండా, భర్త నుంచి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదని తెలిపింది. ఆమె తన వంశ పరిరక్షణ కోసమే పిటిషన్ దాఖలు చేసిందని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌ను తిరస్కరిస్తే హక్కులను కాలరాసినట్టే అవుతుందని.. కావున దోషికి 15 రోజుల పెరోలు మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించి పెరోలు పొందొచ్చని చెప్పింది.
-----------------------
Admin