సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్త గూడెం పట్టణం లో ప్రైవేటు డాక్టర్లు మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నారని, వారి నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేర్రా కామేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా మారిన పట్టణంలో కనీస వైద్య సౌకర్యాలు కరువయ్యాయని, ప్రైవేటు డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటామని బోర్డులు ఏర్పాటు చేసి, రాత్రి 10 దాటితే ఇండ్లలో నుంచి బయటకు రావడం లేదని మండిపడ్డారు. అత్యవసర కేసులు వస్తే అక్కడ పని చేసే సిబ్బంది వైద్యులు లేరని చెబుతున్నారని,అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు. తెల్లవారుజామున గుండెపోటుతో హాస్పిటల్ కు వచ్చిన వ్యక్తి రెండు గంటల పాటు తిరిగి తిరిగి చివరికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం నియోజకవర్గంలో వైద్య పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తుందని ఆరోపించారు. సమాజంలో జర్నలిస్టుగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తికి ఇటువంటి సంఘటనలు ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. అంతా అయిపోయిన తరువాత శవానికి దండలు వేయటం ఎవరి సానుభూతి కోసమని నిలదీశారు. అర్ధరాత్రి ప్రమాదాలు జరిగిన, గుండెపోటు లాంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించాల్సిన డాక్టర్లు మానవత్వం మరచి వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా వ్యాపార ధోరణితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ప్రభుత్వ స్థలాలను ఉచితంగా తీసుకొని అక్రమ పద్ధతిలో పట్టాలు సైతం పొందారని అయినా ఇక సేవా ధృక్పదం ఎక్కడ ఉందని ధ్వజమెత్తారు. వెంటనే ఉన్నతాధికారులు ప్రజారోగ్యం పై దృష్టి సారించాలని ప్రైవేట్ డాక్టర్ల అడ్డగోలు దోపిడీ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారు విధులు నిర్వహించేలా మానిటరింగ్ చేయాలని తద్వారా అమాయక ప్రజలు బలి కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు వైద్యులు ఇకనైనా పద్దతి మార్చుకొని సేవా భావంతో పని చేయాలని హితవు పలికారు. ఈకార్యక్రమంలో సాయి,అల్లకొండ శరత్, తొర్తి నవీన్, కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin