సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మంచినీటి పైపులైన్లు లీకేజిలు తక్షణం మరమ్మత్తులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల యంపిఓడిఓలను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో పారిశుద్య కార్యక్రమాలు, ఇంటింటి నుండి తడి, పొడి చెత్త సేకరణ, పంచాయతీ భవనాలు నిర్మాణం, హరితహారం, ఉపాధిహామి పథకం పనులు, మంచినీటి సరఫరా తదితర అంశాలపై పంచాయతీరాజ్, వైద్య, మిషన్ బగీరథ, స్వీప్ కార్యక్రమాలు నిర్వహణ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లీకేజీలు వల్ల మురుగునీరు చేరి మంచినీరు కలుషితమవుతాయని, తద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మరమ్మత్తులు చేపట్టాలని చెప్పారు. మంచినీటి ట్యాంకులను 10 రోజులకొకసారి తప్పని సరిగా పరిశుభ్రం చేయాలని చెప్పారు. జిల్లాలో 286 పంచాయతీలకు భవనాలు మంజూరు చేశామని, వాటిలో 31 చోట్ల పనులు ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ భవనాల నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులు, యంపిడిఓలు నిరంతర పర్యవేక్షణ చేయాలని పనుల్లో ప్రగతి రావాలని చెప్పారు. ఇంజనీరింగ్ అధికారులు, యంపిడిఓలు ఇచ్చిన నివేదికల్లో వ్యత్యాసం ఉన్నదని, తప్పుడు నివేదికలు అందచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే వారంలో అన్ని పనులు ప్రారంభం కావాలని, ఇంకా ప్రారంభం కాలేదనే కారణాలు చెప్పొద్దని చెప్పారు. ఈ దఫా నిర్వహించే సమావేశంలో భవనాల నిర్మాణానికి స్థల సమస్య ఉందని, ప్రారంభం కాలేదని చెప్పొద్దని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. డ్రెయిన్లలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేయాలని చెప్పారు. మురుగునీటి నిల్వలు వల్ల దోమలు వ్యాప్తి జరిగి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మంగళ, శుక్రవారాల్లో ప్రతి ఇంటిలో డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. డ్రై డే కార్యక్రమాలు సర్పంచ్, కార్యదర్శి,ఆశా కార్యకర్తలు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. దోమలు వ్యాప్తి నిరోధానికి ఫాగింగ్, మురుగునీరు నిల్వ ప్రాంతాల్లో ఆయిల్బాల్స్, గంభూషియ చేపలు వేయాలని చెప్పారు. జ్వరాలు ప్రబలే ప్రాంతాల్లో ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టడంతో పాటు, వైద్య క్యాంపులు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిరోధక పరీక్షలు నిర్వహిస్తున్నామని, అస్వస్థతకు గురైన ప్రజలు తక్షణమే వైద్యలను సంప్రదించి వైద్య సేవలు పొందాలని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వైద్య సేవలకు ఆర్యాంపిలను సంప్రదిస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధిహామి పథకం పనులకు కూలీలను పెద్ద ఎత్తున మొబలైజ్ చేయాలని చెప్పారు. ఈ పథకంలో పండ్ల మొక్కలు పెంపకానికి అవకాశం ఉన్నందున రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. హరితహారం లక్ష్యం మేర పూర్తి చేయాలని చెప్పారు. తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు స్థల సమస్య ఉన్న మండల తహసిల్దార్లు, యంపిడిఓలు భూమి అందుబాటులో లేనట్లు ధృవీకరణ నివేదికలు అందచేయాలని చెప్పారు. ఓటుహక్కు నమోదుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈవియంల ద్వారా ఓటుహక్కు నమోదుపై జరుగుతున్న మాక్ పోలింగ్ను యంపిడిఓలు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. జిల్లాలో 100 పాఠశాలలు, 70 కళాశాలల్లో ఎలక్ట్రో లిటరసి క్లబ్బులు ఏర్పాటు చేశామని, కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. నమూనా ఓటింగ్ కార్యక్రమాలకు యంపిడిఓలు కస్టోడియన్ అధికారులుగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, జడ్పీ సీఈఓ విద్యాలత, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, మిషన్ బగీరథ ఇంట్రా ఈఈ నళిని, పంచాయతీరాజ్ ఈఈలు శ్రీనివాసరావు, మంగ్యా, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin