సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇండోర్ స్టేడియం నుండి ఆయా పాఠశాలల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చిత్రపటంగా విద్యార్థులు అలంకరించారు. అదేవిధంగా ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకుంది. స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న నేతృత్వంలో పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటు రాష్ట్ర సహకార సొసైటీ చైర్మన్ రాజా వరప్రసాద్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు, మహిళలు, ఆశాలు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో గత తొమ్మదేళ్లుగా ఎంతో అభివృద్ధిని సాధించామని అన్నారు. సాధించిన తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారద్యం వహిస్తూ జనరంజక పాలన చేపట్టారని అన్నారు. అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన తెలంగాణలో ముఖ్యంగా భూముల ధరలు పెరగడం, నిరంతర విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల రూపకల్పన, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు ఇలా ఇంకా ఎన్నో మహాత్తర కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేసుకున్నారు. ప్రజల సహకారం, ఆశీర్వాదం ఉంటే ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. శ్రీశైలం నుండి షాద్ నగర్ వరకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తరలించి ఇంటింటికి నల్ల ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వాన్నిదని అన్నారు. ఇంటింటికి నల్లా ఇస్తామని చెబితే కొందరు నవ్వుకున్నారని ఇప్పుడు ఇంటింటికి నల్ల చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు షాద్ నగర్ పట్టణంలో 2025 పింఛన్లు వచ్చేవని, దీనికి ప్రతినెల 5 లక్షల 56 వేల రూపాయలకు పైగా ఖర్చయ్యావని తెలంగాణ వచ్చాక 4175 పింఛన్లు ఇస్తున్నామని, వీటికి ప్రతినెల 87 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఆనాడు 65 ఏళ్లలో జరగని అభివృద్ధి నేడు 9 ఏళ్లలో ప్రగతిని సాధించామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని ఎమ్మెల్యే అన్నారు. షాద్ నగర్ చూస్తే గర్వంగా ఉంది అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్. తను కలెక్టర్ గా జిల్లాకు వచ్చాక మొట్టమొదటి సారి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నానని అప్పటికి ఇప్పటికి షాద్ నగర్ పట్టణంలో అభివృద్ధిలో తేడా చూస్తే గర్వంగా ఉందని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు. పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రహ్మాండంగా రోడ్లు హరితహారం ప్రభుత్వ భవనాలు చూస్తుంటే ఒక అధికారిగా తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా షాద్ నగర్ నియోజకవర్గం పాలనాపరంగా మెరుగ్గా ఉందని చెప్పడం విశేషం. మిగతా నియోజకవర్గాల నుండి రోజు ఏదో ఒక పరిపాలన విషయంలో తలనొప్పి ఉంటుందని కానీ షాద్ నగర్ నుండి ఈ యొక్క పట్టణం నుండీ ఎలాంటి పెద్ద సమస్య తన దృష్టికి రాలేదని పొగిడారు. అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల విషయంలో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో మెరుగ్గా వేతనాలు ఇస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు భీమా సౌకర్యం కల్పించిన ఘనత కూడా ప్రభుత్వాన్నిదని గుర్తు చేశారు. కాలుష్యాన్ని విడనాడండి రాష్ట్ర సహకార చైర్మన్ రాజా వరప్రసాద్. పట్టణంలో కాలుష్యం బారిన పడకుండా ప్రజలు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని రాజా వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పట్టణం ఎందరికో బ్రతుకుతెరువు ఇస్తుందని ఇక్కడ జీవనం సాగించడానికి అనేక రాష్ట్రాల నుండి ఎందరో వలస కార్మికులు ప్రజలు వచ్చారని అన్నారు. వారందరూ ఇక్కడ అనేక ఇళ్లలో అద్దెకు ఉంటున్నారని వారికి సొంత ప్రాంతంపై మమకారం ఉన్నట్టు ఇక్కడ ఉండదని, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం ప్లాస్టిక్ కవర్లు రోడ్లపై పడేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నామని, ఇది చాలా బాధాకరమని అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు కార్మికులు ఎంతగానో కృషి చేస్తున్నారని దీనికి తూట్లు పొడిచేలా ప్రజలు కొంతమంది వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా స్థానికంగా జరిగే కార్యక్రమాలకు పెద్ద వాహనాలు, కార్లలో రాకుండా సైకిళ్లపై రావాలనీ రాజా వరప్రసాద్ కొత్త ఆలోచన పెట్టారు. ప్రతి ఒక్కరు కార్లు తీసుకొని కార్యక్రమాలకు వస్తే రోడ్లన్నీ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోతున్నాయని అందుకే పట్టణంలో సాధ్యమైనంతవరకు పొల్యూషన్ లేకుండా సైకిళ్లపై తిరగాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక టిఆర్ఎస్ నాయకుడు యుగంధర్ మాట్లాడుతూ ప్రగతి అంటే మౌలిక సదుపాయాలనే కాదు మెరుగైన జీవన విధానం అని ఆ మెరుగైన జీవన విధానానికి దోహదపడుతున్న స్థానిక ఎమ్మెల్యే అంజయ్య కృషిని యుగంధర్ కొనియాడారు. మరో యువ నేత మహమ్మద్ ఎజాజ్ (అడ్డు) మాట్లాడుతూ.. కనివిని ఎరుగని రీతిలో షాద్ నగర్ పట్టణం ప్రగతి పథంలో దూసుకుపోతుందని దీనికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కృషి అనిర్వచనీయమని ఆయన అన్నారు. మహిళా సంఘాలకు 50 లక్షలు చెక్కు అందజేత. షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాలకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, చైర్మన్ రాజా వరప్రసాద్ చేతులమీదుగా 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మహిళా సంఘాలకు ఆర్థిక రుణాలకు సంబంధించి ఈ చెక్కును అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులు మురళి నాయక్ తదితరులు ఆటపాటలతో మెప్పించారు. కార్యక్రమానికి ముందు మున్సిపల్ భవనంపై జెండావిష్కరణ చేశారు. అనంతరం పారిశ్యుద్ద కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, కమిషనర్ వెంకన్న, నోడల్ ఆఫీసర్ భాస్కర్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, స్ధానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin