సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్ పూర్తి చేశాడు. స్థానికంగా కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను అతడు స్నేహితులతో కలిసి వీక్షిస్తున్నాడు. అయితే భారత్ బ్యాటింగ్ సమయంలో తీవ్ర నిరాశ చెందాడు. బౌలర్స్ మ్యాచ్ గెలిపిస్తారని ఆశపడ్డాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ చేజారుతుండటంతో జ్యోతి కుమార్ తీవ్ర ఆందోళన చెందాడు. సాయంత్రం ఆరు గంటలకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాక.. త్వరగానే 3 ఆస్ట్రేలియా వికెట్లు పడటంతో.. ఇక మ్యాచ్ మనదే అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత మన బౌలర్లు వరుసగా పరుగులు ఇచ్చేస్తుంటే, జ్యోతి కుమార్ తీవ్ర ఆందోళన చెందాడు. ఆస్ట్రేలియా గెలుపు, ఇండియా ఓటమి తర్వాత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి అతను తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో జ్యోతి కుమార్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి స్నేహితులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుమారుడి హఠాన్మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. త్వరలో వివాహం చేయాలనుకున్నామని, ఇంతలో తమ బిడ్డ చేజారిపోతాడని ఊహించలేకపోయాం అంటూ రోధించారు. వరల్డ్ కప్‌లో టీం ఇండియా మ్యాచ్ ఓటమి అతని ప్రాణాలపైకి తెచ్చింది. ఈ మ్యాచ్ అతను చూడకపోయి ఉంటే, బతికుండే వాడని తల్లిదండ్రులు విలపించారు. అనవసరంగా చూసి, ప్రాణం కోల్పోయినట్లైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తొలుత చెలరేగిన టీమ్ ఇండియా ఎన్నో ఆశలు పెట్టుకునే చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వకుండా బేజారుగా ఆడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
-----------------------
Admin